నమస్తే శేరిలింగంపల్లి : ప్రయాణీకుల సౌలభ్యం, ప్రజా రవాణా సౌకర్యం వైపు ఆలోచిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా మరో రాయితీని ప్రకటించింది. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – బెంగళూరు వెళ్లే గరుడ, రాజధాని సర్వీసుల ఛార్జీలను ఈ నెలాఖరు వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలతో ముందుకెళ్తూ ప్రయాణీకుల ఆదరణను చూరగొంటోన్న టి.ఎస్.ఆర్టీసీ రవాణా సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎం.ఎల్.ఎ , మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ మాట్లాడుతూ, హైదరాబాద్ – విజయవాడ ల మధ్య నడిచే అంతరాష్ట్ర బస్సులు అంటే గరుడ ప్లస్, రాజధాని సర్వీసులలో శుక్రవారం, ఆదివారాల్లో మినహా మిగతా రోజుల్లో టిక్కెట్టు ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే హైదరాబాద్ – బెంగళూరు గరుడ సర్వీసులో 10 శాతం టిక్కెట్టు ఛార్జీని తగ్గించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే ఈ సర్వీసులకు, ఆదివారం రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఈ సర్వీసులకు ఈ రాయితీ ఉండదని స్ఫష్టం చేశారు. అందించే ఈ తగ్గింపు ఛార్జీలు ఈ నెలాఖరు 30 వరకు వర్తించనున్నట్లు వారు తెలిపారు. ఆ సర్వీసులలో 10 శాతం ఛార్జీలు తగ్గించడంతో ప్రయాణీకులకు మరింత ఆదరిస్తారని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ – విజయవాడ, హైదరాబాద్ – బెంగళూరుకు వెళ్లి వచ్చే ప్రయాణీకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.