నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేసిన అభివృద్ధి శూన్యమని, ఆరెకపూడి గాంధీ హటావో…శేరిలింగంపల్లి బచావో నినాదంతో పనిచేసి టీఆర్ఎస్ పతనానికి శేరిలింగంపల్లి నుంచే నాంది పలుకుతామని మినిమమ్ వేజ్ అడ్వయిజరీ బోర్డు, తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీపై ఫైర్ అయ్యారు. చందానగర్ లోని విద్యా నగర్ కాలనీలోని ఆమె స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అరాచకాలు నచ్చకనే బీజేపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 26న ఆదివారం చందానగర్ నుంచి ర్యాలీగా బయల్దేరి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. సామ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2001 టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు నేటి టీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు కరువైందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పదవులను కట్టబెడుతున్నారన్నారు. ప్రైవేటు రంగంలో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తామని చెప్పి నేడు కార్మిక సంఘాలకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం విడ్డూరమన్నారు. శేరిలింగంపల్లి లో టీఆర్ఎస్ పార్టీకి నాంది పలికిన మేమే అదే పార్టీని బొంద పెట్టేందుకు మా నుంచే నాంది పలుకుతున్నామని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంతృప్తిగా లేని పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ విధానాలు నచ్చకనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామని సామ వెంకట్ రెడ్డి ప్రకటించారు.
ఎమ్మెల్యే గాంధీకి రిటర్న్ గిప్ట్ ఖాయం
– మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఓడించడమే లక్ష్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామని చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. ప్రజల్లో ఉండి ప్రజా సేవకోసం ఎల్లవేళలా పనిచేస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చందానగర్ కార్పొరేటర్ టికెట్ రాకుండా కుట్రలు పన్నిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి రిటర్న్ గిప్ట్ ఇస్తామన్నారు. టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేయాలనుకున్నామని, ఎమ్మెల్యే గాంధీ వ్యక్తిగతంగా కక్ష్యకట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేస్తూ అణచివేయాలని చూశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసినా సరైనా గుర్తింపు లేకపోవడంతోనే ఈ నెల 26 న వెయ్యి మందితో బిజెపి రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆమె వెల్లడించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గం ప్రజలకు చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎమ్మెల్యే ఒక వార్డు మెంబర్ లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్పొరేటర్ల ఫండ్ ద్వారా మంజూరైన అభివృద్ధి పనుల శిలాఫలకాలకు శంకుస్థాపనలు చేయడమే తప్పా ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మహిళలకు ప్రధాన్యత లేదని, ఏ ఒక్క మహిళా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న అనుచిత విధానాలను మహిళలకు తెలియపరుస్తాం అన్నారు. శేరిలింగంపల్లిని అగ్రగామిలో ఉంచుతామని మాయమాటలు చెబుతున్న గాంధీ మోసాలను ఎండగడుతామని నవతా రెడ్డి అన్నారు. నాలాల వద్ద ఫోటోలకు ఫోజులివ్వడమే తప్పా ముంపు ప్రాంతాలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. మా ఏకైక నినాదం ఆరెకపూడి హటావో… శేరిలింగంపల్లి ప్రజలు బచావో.. అని ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొబ్బ విజయా రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు రమణా కుమారి, కవిత, సంద్య, టీఆర్ఎస్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు రాధిక, మైనార్టీ జనరల్ సెక్రటరీ గౌస్, చందర్ రావు యాదవ్, నర్సింహా రావు, ప్రమోద్, రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యులు, సంగారెడ్డి జిల్లా ఇంచార్జీ సాయిరాం గౌడ్, సంగారెడ్డి జిల్లా స్పోక్స్ పర్సన్ సాయికుమార్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
అంతకుముందు మినిమమ్ వేజ్ బోర్డు చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ సంగం అధ్యక్షుడు చంద్ర శేఖర్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మనోహర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణ రెడ్డి, సామ రంగా రెడ్డి లతో వెళ్లి కలిశారు. బండి సంజయ్ ఆహ్వానం మేరకు బిజెపి లో ఈ నెల 26న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తమ అనుచరులతో కలిసి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.