కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్ మాదాపూర్, వినాయక నగర్, గుట్టల బేగంపేట్, ఆంధ్రాకాలనీ, గపూర్ నగర్ లలో బీజేపీ నాయకులు మార్పుకోసం బీజేపీ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ ఇంచార్జి గజ్జల యోగానంద్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజక వర్గంలో ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆరోపించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని, నియోజకవర్గ పరిధిలో ఒక్క డబల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని, చెరువులు కబ్జా అవుతున్నాయని, అధికార పార్టీ నాయకుల కనుసన్నలలోనే కబ్జాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జా అవుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. రోడ్లు పాడైపోయి గుంతలుపడ్డాయని, మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ తెరుచుకుని ఉన్నాయని, వర్షం వస్తే బస్తీలన్నీ జలమయం అవుతున్నాయని, పేదలకు నీడ కరువైందని అన్నారు. వైద్యం, విద్య అందడమే లేదన్నారు.
భారీ వర్షాలకు నష్టపోయిన వరద బాధితులందరికీ రూ.10వేల సహాయం అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్రనాయకులు బల్ద అశోక్, ప్రభాకర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు నీలం జయరాములు, ఆంజనేయులు , బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, మేరీ , వినీత సింగ్ , మాణిక్ , నరేష్ , మల్లేష్ , శ్రీనివాస్ , వెంకటనాయక్ , వెంకటరమణ , దేవమన్ యాదవ్ , దీపక్ వర్మ , కుందన్ గుప్తా, ఆకాష్ , మాదాపూర్ నరేశ్, బీజేపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.