బీసీలంతా సుర‌భి వాణీదేవికే మ‌ద్ధ‌తు తెలుపుదాం: వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌ రావు

న‌‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల టీఆర్ఎస్ అభ‌ర్థి సురభి వాణిదేవిని గెలిపించుకుని, బిసిల నిబధ్ధతను చాటుకుందాం అని రాష్ట్ర బిసి కమిషన్ పూర్వ సభ్యులు, టీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు పిలుపు నిచ్చారు. చందాన‌గ‌ర్‌లోని ఫెండ్స్ కాల‌నీలో జాతీయ బిసి అధ్యయన వేదిక, రాష్ట్ర బిసి కులసంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో బిసి కుల సంఘాల ప్రతినిధుల సమావేశం శుక్ర‌వారం నిర్వ‌హించారు. బీసీ అధ్య‌యన వేధిక అధ్య‌క్షులు డీవీ కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల నుండి బిసి సంఘాల, మహిళా సంఘాల ప్రతినిధులు, పట్టభద్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ మోహ‌న్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా, సంక్షేమ పథకాల అమలులోనే మానవీయ కోణాన్ని చాటుకున్న దార్శనిక పాలకుడు KCR అని, బలహీన వర్గాలకు అన్నింటా అగ్రతాంబూలం ఇచ్చారని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రాలలో నాటి ప్రభుత్వాలు బీసీలను ఓటు బాంకులుగా వాడుకున్నాయే తప్ప, ఈ వర్గాల సమగ్ర వికాసం ను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తొమ్మిదేళ్లు (1995-2004) అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బిసిలకు వెచ్చిచింది కేవలం 1719.23 కోట్ల నిధులు మాత్రమే అన్నారు..2004 నుండి 2014 వరకు పదేళ్ల వరకు, నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వెరసి13,474.22 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారన్నారు. అందులో తెలంగాణ ప్రాంతానికి కేటాయింపులు అంతంత మాత్రం గానే ఉన్నాయన్నారు. అదే రాష్ట్రం ఏర్పడిన ఈ ఆరున్నర ఏళ్లలో 26,838.39 కోట్ల నిధులను ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని వకుళాభరణం పేర్కొన్నారు. వందలాది రెసిడెన్షియల్ పాఠశాలలు, ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ,కులసంఘాల ఆత్మగౌరవ భవనాలు, పూర్తి సబ్సిడీతో ఋణాలు, ఇలా ఎన్నెన్నో పథకాలు అమలులోకి తెచ్చిన ఘనత టీఆర్ఎస్‌‌ ప్రభుత్వానిదే అన్నారు. ఇలా సామాజిక న్యాయం దృక్పథంతో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. నేడు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ ప్రతిష్టను పెంచడంలో వాణిదేవి గెలుపుతో దీటైన సమాధానం ఇవ్వాలని ఆయన కోరారు.

సుర‌భి వాణీదేవికి మ‌ద్ధ‌తుగా ప్ర‌తిజ్ఞ చేయిస్తున్న వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్‌, డీవి కృష్ణ‌రావు, మోటూరి నారాయ‌ణ రావు త‌దిత‌ర‌లు

బ్రాహ్మణ సమాజంకు చెందిన సురభి వాణికి ఎందుకు మద్దతు తెలపాలని ప్రశ్నించేవారికి సమాధానంగా స్వర్గీయ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు బిసిలకు చేసిన సేవ ఎనలేనిదని ఆయన గుర్తు చేశారు. పీవీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో నాటి శాసనసభ ఎన్నికలలో బిసిలకు 75 సీట్లు కేటాయించిన ఘనత ఆయనదే అన్నారు. రాష్ట్రంలో సీఎంగా, దేశానికి ప్రధానమంత్రిగా రెండు సందర్భాలలో బిసిలకు విద్యా, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమల్లోకి ఆయనే తెచ్చారని వివరించారు. జాతీయ స్థాయిలో బిసి కమిషన్, బిసి ఆర్థిక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది పీవీనే అని గుర్తు చేశారు. నవోదయ పాఠశాలలను నెలకొల్పి కార్పొరేట్ విద్యను ప్రతిభ కల్గిన పేద వర్గాలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారని వకుళాభరణం పేర్కొన్నారు. ఇంతగా సేవ చేసిన‌ ఆయనకు ఘన నివాళిగా ఆయన తనయ సురభి వాణి దేవిని ఎమ్మెల్సీగా గెలిపించడంలో మద్దతుగా నిలబడడంలో తప్పేముందని వకుళాభరణం అన్నారు. అనంతరం కృష్ణారావు తీర్మానాలను ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదింపజేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ అధ్యయన వేదిక ప్రతినిధులు బి. విజయ్ కుమార్, మోటూరి నారాయణ రావు, వేంకట నారాయణ, పోసిన నాగరాజు, రాం మాధవ్, సాయి ధర్మాన, సత్యలక్ష్మీ, వాసుదేవ్ నేత, శివప్రసాద్, లింగంగౌడ్,కృష్ణమూర్తి,రఘు యాదవ్,గాదె సమ్మయ్య,వైద్య వెంకటేశ్వర్లు, సమ్మయ్య ముదిరాజ్, గీతాదేవి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here