నమస్తే శేరిలింగంపల్లి: హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులు, సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేవని, అందరం సమానమేనని సుమారు గత 800 సంవత్సరాల క్రితమే చాటి చెప్పిన మహనీయుడు బసవేశ్వరుడు అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 889వ జయంతి ఉత్సవాలను హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఇంజినీరింగ్ ఎన్ క్లేవ్ కాలనీలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు వి. జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బసవ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కర్ణాటకలోని బాగేవాడిలో తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ సంతానం బసవేశ్వరుడు చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అభ్యసించి ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులను వదలి కూడల సంగమ అనే పుణ్యక్షేత్రానికి చేరుకున్నారని తెలిపారు. అక్కడ ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానిస్తూ 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారిగా నియమింపబడి భండారీ బసవడుగ ఖ్యాతిని పొందారన్నారు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో లింగాయత ధర్మంగా స్థిరపడిందిని, శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన దైవం లేదన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకుని లింగాయత మతానికి బీజాలు వేసిన మహనీయుడని గుర్తు చేశారు.
కొండా విజయ్ మాట్లాడుతూ సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడు హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఒకరని తెలిపారు. ఆయన సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేవని అందరం సమానమేనని చాటి చెప్పిన మహానియుడని కొనియాడారు. లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించి, లింగాయత ధర్మం స్థాపించిన అభ్యుదయ వాది అని అన్నారు. అనంతరం కొండా విజయ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు పేదలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, సయ్యద్ గౌస్, మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, లింగంపల్లి టీఆర్ఎస్ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త తుడి ప్రవీణ్, మిరియాల రాఘవరావు, ఉరిటి వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.