శేరిలింగంపల్లి, ఫిబ్రవి 11 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో బల్దియా కమీషనర్ ఇలంబర్తి, హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ , ట్రాఫిక్ సిపి జోయస్ డేవిడ్, ప్రాజెక్ట్స్ సిఇ భాస్కర్ రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సహా ప్రాజెక్టు విభాగంతోపాటు ఇతర విభాగాల అధికారులతో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని ఐఐటి జంక్షన్ , గచ్చిబౌలి జంక్షన్ , రాడిసన్ జంక్షన్ ల వద్ద చేపట్టనున్న కూడళ్ల అభివృద్ధి సుందరీ కరణ పనులను కమిషనర్ పరిశీలించారు . ఐఐటి జంక్షన్ వద్ద హెచ్ సి టి (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI)) పథకంలో కొత్తగా నిర్మించబోయే ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ప్రాజెక్టు విభాగం అధికారులతో సమీక్షించారు.
జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కూడళ్ళ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను కమిషనర్ కు వివరించారు .ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ ఇలంబర్తి మాట్లాడుతూ కూడళ్ళ సుందరీ కరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు .పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా కూడళ్లను అభివృద్ధిపరిచి వాహనాలు సులువుగా ముందుకు సాగేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాహనదారులకు ఎటువంటి అసౌకర్యం కలగని రీతిలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు . ఐఐటి జంక్షన్లో చేపట్టనున్న ఫ్లైఓవర్ , అండర్ పాస్ నిర్మాణాలకై ఆస్తుల సేకరణ ట్రాఫిక్ ఇతర అంశాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు . ఐటి పరిశ్రమలు అధికంగా ఉన్న శేరిలింగంపల్లి జోన్‌లో రహదారుల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ మరింత సౌకర్యాన్ని కలిగించేలా చూడాలని అధికారులను కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు . ఈ కార్యక్రమంలో పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.