శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): బిసి డిమాండ్లను నెరవేర్చాలని, జన గణనలో కులగణన చేయాలని, బీసీ రక్షణ చట్టాలను అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాస్తే అక్రమంగా అరెస్టులు చేయడం సమంజసం కాదని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. బిసి డిమాండ్లను ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై బేరి రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాయడంలో తప్పేముందని ప్రశ్నించారు. మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న నరేంద్ర మోడీకి 10 డిమాండ్లతో బహిరంగ లేఖ రాయడం జరిగిందన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి అమలు చేయాలని, జనగణనలో కులగణనను చేర్చి లెక్కించాలని, బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని అన్నారు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీ రక్షణ చట్టం చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పునఃసమీక్షించాలని, రోహిణి కమిషన్ అమలు చేయాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, క్రిమిలేయర్ రద్దుచేయాలని, ఉన్నత న్యాయస్థానాల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం చూపాలని ప్రధాని నరేంద్ర మోడీని రామచంద్ర యాదవ్ కోరారు.





