అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్.. ప్రజాస్వామ్యానికి విరుద్ధం: బీఆర్ఎస్ నేతలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా కొండాపూర్ డివిజన్‌లోని మార్తాండ నగర్ ఇంపీరియల్ హోటల్ సమీపంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు అసెంబ్లీలో తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రస్తావించే హక్కు ఉందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి కానీ, వారిని సభకు రాకుండా అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం సమస్యకు పరిష్కారం కాదని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలు గతంలో పలుమార్లు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వెళ్లిన సందర్భాలను గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై వెయ్యి రోజులు పూర్తయినా ప్రజలకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహిళలకు గౌరవం ఇస్తామని చెప్పిన ఇందిరమ్మ ప్రభుత్వం.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పట్ల వ్యవహరించిన తీరు దారుణమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల మగ పోలీసులు చీర లాగడం, మెడ పట్టుకోవడం అత్యంత నీచమైన చర్యగా అభివర్ణించారు.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, నిరసన తెలిపే హక్కు, ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించే హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలను చైతన్యపరిచి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రవియాదవ్, సంగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, బాబు మియా, రోజా, మమత, శ్రీకాంత్, అల్లావుద్దీన్, సంతోష్, శివరాజ్, జుబేర్, ఖదీర్, రాహుల్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here