- గాంధీ అని మహాత్ముడి పేరు పెట్టుకొని చేసేది ఆక్రమణలా..?
- భూ ఆక్రమణలపై కాంగ్రెస్ సర్కార్ వెనకడుగు వెనుక మతలబేంటి..?
- ప్రభుత్వ భూమి ఆక్రమించారని వస్తున్న ఆరోపణలపై వెంటనే క్షమాపణ చెప్పి నిజం ఒప్పుకోవాలి
- పేదోడిపైనే హైడ్రా ప్రతాపం.. తిమింగలాల జోలికి వెళ్లని అధికారులు
- ఎమ్మెల్యే ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోకపోవడంపై ప్రజల ఆగ్రహం
- పార్టీ మారిన ఎమ్మెల్యేకు త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
- పేదోడికి పదేళ్ల కేసీఆర్ పాలనలో శ్రీరామ రక్షగా కేటీఆర్ అండగా నిలిచారు
- భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజం
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీపై భారాస సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ఆక్రమణలపై వస్తున్నఆరోపణలు నిజమేననేలా ఆరెకపూడి గాంధీ వ్యవహరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సైతం దొంగలకు సహకరిస్తూ, పేదలకు కూడు, గూడు లేకుండా చేస్తుందన్నారు. గాజులరామారంలోని భూ ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో వెనకాడటం వెనుక మతలబేంటీ..? అని ప్రశ్నించారు. పేదలు కట్టుకున్న ఇండ్లను కూల్చిన హైడ్రా, ఆ భూమి పక్కనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆక్రమించినట్లుగా వస్తున్న సర్వే నెంబర్ 307ని భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గాంధీ అని మహాత్ముడి పేరు పెట్టుకొని చేసేది అక్రమాలు, ఆక్రమణలా..? అని ప్రశ్నించారు. ప్రజలు గెలిపిస్తే పార్టీ మారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమాస్తులను కాపాడుకునేందుకు పార్టీ మారారా..? అని ప్రజలు చర్చించుకుటున్నారని వెల్లడించారు. ప్రజలను, పార్టీలను మోసగించడంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఘనుడిగా కీర్తించబడుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీపై ఉందన్నారు. పేదల తరుపున ఎప్పుడూ అండగా ఉంటూ వస్తున్నది కేవలం భారాస మాత్రమేనన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క పేదవారికి అన్యాయం జరగకుండా కేసీఆర్ శ్రీరామ రక్షగా నిలిచారని గుర్తు చేశారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై, అక్రమాలపై పోరాటం సాగిస్తామని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.





