శేరిలింగంపల్లి, మే 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంట చెరువు అలుగు నుండి జాతీయ రహదారి NH-65 వరకు రూ.1 కోటి 92 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన వరద నీటి కాల్వ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి వర్షాకాలంలో వరద నీరు కాలనీలను ముంచెత్తుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో ఈ వరద నీటి కాల్వ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడా రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా మురళీధర్ సొసైటీ కాలనీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలని, రాబోయే వర్షాకాలానికి ముందే కాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వరద సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నామని, పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వరద నీటి కాల్వ నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు భారీ ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూర్తి, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





