పేదల ఇళ్లే టార్గెట్‌గా కూల్చివేతలా? మిద్దెల మల్లారెడ్డి ప్రశ్నలు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): పేద, మధ్యతరగతి ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు మిద్దెల మల్లారెడ్డి ప్రశ్నించారు. శేరిలింగంపల్లి పరిధిలోని అయ్యప్ప సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పల్లెటూర్లలోని భూములు, ఇళ్ల స్థలాలను అమ్ముకుని నగరానికి వలస వచ్చిన పేదలు 40, 50, 60, 70 గజాల స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇళ్లు నిర్మించే సమయంలోనే అధికారులు వచ్చి స్లాబ్‌కు, ఒక్కో అంతస్తుకు అంటూ డబ్బులు తీసుకున్నారని, అప్పట్లో అభ్యంతరాలు చెప్పకుండా ఇప్పుడు నిర్మించిన ఇళ్లను కూల్చివేయడం బాధాకరమన్నారు.

అయ్యప్ప సొసైటీలో దాదాపు 4 వేల గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా 11 అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. అలాంటి నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేతలు చేపట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భయపడుతున్నారా? లేక రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారా? అని ఆయన నిలదీశారు. అక్రమ నిర్మాణాలపై సిఎంసి కమిషనర్ సృజ‌న‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఇకపై 75 గజాల లోపు స్థలాల్లో మూడు అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణాలకు అనుమతి ఉంటుందని ముందుగానే ప్రజలకు స్పష్టంగా ప్రకటించాలని కోరారు. తద్వారా ప్రజలు నిబంధనలకు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటారని సూచించారు.

ప్రజల రక్తం, చెమటతో నిర్మించుకున్న ఇళ్లను ముందస్తు అవగాహన లేకుండా కూల్చివేయకుండా అధికారులు నిర్ణయాన్ని మరోసారి పునరాలోచించాలని మిద్దెల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేకుండా భారీగా నిర్మించి వాటిని వ్యాపారంగా విక్రయిస్తున్న నిర్మాణదారులపై మాత్రం ఎలాంటి హెచ్చరికలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గరీబోళ్లను బతకనీయండి.. నిబంధనలు ఉల్లంఘించే భారీ నిర్మాణాలపై చర్యలు తీసుకోండి అని సిఎంసి కమిషనర్‌కు మిద్దెల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఆయన తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here