శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం సెప్టెంబర్ 4న మియాపూర్ లోని ముజాఫర్ అహ్మద్ నగర్‌లో ఉన్న పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ తెలిపారు. స్టాలిన్ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

సమావేశంలో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు వనం సుధాకర్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్ కార్యక్రమాలను నిర్ణయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.





