శేరిలింగంపల్లి, ఏప్రిల్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ అన్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం పార్టీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు బిజెపి సీనియర్ నాయకుడు కొండకల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని, పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు గంగల రాధాకృష్ణ యాదవ్ పాల్గొని కార్యకర్తలతో కలిసి డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని, బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని, పరిసరాలను శుభ్రపరిచారు. గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కృషి చేయాలని అన్నారు. దళితులకు, వెనకబడ్డ కులాలకు సమాజంలో గౌరవం కల్పించడం, రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రమే కాదని అది జీవన వాహనమని, ప్రజలు ప్రశ్నించడం మానేస్తే అది బానిసత్వానికి అలవాటు పడుతున్నట్లే అని, విద్య లేదంటే స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేదంటే అభివృద్ధి ఉండదు అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గోలి వేణుగోపాల్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, సీనియర్ నాయకులు యాదయ్య , రాజు, గోపాలకృష్ణ, కుమార్, మంజునాథ్, మేధాన్ష్, కార్యకర్తలు పాల్గొన్నారు.






