శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యానగర్ బిసి భవన్ లో డాక్టర్ అరుణ్ కుమార్ , మాజీ బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో సాయి ఈశ్వర చారి చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఈశ్వరాచారి మృతి చెందడం అత్యంత విషాదకరమని, బీసీలు ఎవరూ ఇలా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని, అందరు కలసి పోరాడి హక్కులను సాధించుకుందామని అన్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీ సమాజం తెలంగాణను సాధించిందని, అదే రకంగా స్వాతంత్రం సాధించిన చరిత్ర కూడా బీసీలకు ఉందన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం, ఉద్యమం ఉధృతంగా చేసి హక్కులను సాధించుకుందామన్నారు. విద్య, వైద్యం, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి అన్ని రంగాల్లోనూ న్యాయం జరిగే వరకూ పోరాడుదాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్కే సాయన్న ముదిరాజ్, హరికృష్ణ చారి, గుజ్జ సత్యం, రాజేష్ , సాయి, కృష్ణమోహన్, శ్రీనివాస్ యాదవ్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.






