మియపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ ఘటన మరువకముందే ఘట్‌కేసర్‌లో అలాంటిదే మరొక ఘటన జరగడం దారుణమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఏఐఎఫ్డిడబ్ల్యూ) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అంగడి పుష్ప అన్నారు. మియాపూర్ లోని ఎంఏ నగర్‌లో ఉన్న ఎంసీపీఐ(యూ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాలేజీ నుంచి ఇంటికి సెవెన్ సీటర్‌లో బయల్దేరిన ఓ యువతిని ఆటో డ్రైవర్ సహా కొందరు వ్యక్తులు బలవంతగా ఘట్‌కేసర్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచార యత్నం చేసేందుకు యత్నించారని అన్నారు. అప్పటికే ఆమె ఫోన్ ద్వారా తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చిందని, దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆ యువతి దగ్గరకు సకాలంలో వెళ్లి రక్షించారని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకురాళ్లు పాల్గొన్నారు.