శేరిలింగంపల్లి, జనవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని మియాపూర్ సర్కిల్ చందానగర్ పోలీస్ స్టేషన్ దగ్గర్లో కొనసాగుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, అక్కడ నాలా ఉందని, ప్రభుత్వ భూమి ఉందని తెలిసి కూడా అనుమతి ఇచ్చిన అధికారులపై దర్యాప్తు చేపట్టాలని, ఇప్పటికే ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి సి.శోభన్ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ వర్షాకాలంలో భారీ వర్షాల నేపథ్యంలో విపరీతమైన వరదలు వచ్చి చుట్టు పక్కల కాలనీలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. గతంలోనే అనేక సార్లు వదరలు వచ్చి కాలనీలు మునిగిపోయిన పరిస్థితి ఉందన్నారు. గంగారం చెరువు నుంచి చందానగర్ మీదుగా అమీన్పూర్లోకి వెళ్లే గొలుసు కట్టు నాలాను పూర్తి కబ్జా చేశారని, రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులను మభ్యపెట్టి అక్రమంగా అనుమతులు తీసుకుని భారీ నిర్మాణం చేపడుతున్నారని అన్నారు. భవనానికి ఎలాంటి దారి లేదని, నాలాపై అక్రమంగా స్లాబ్ వేసి దాన్ని దారిగా చూపించి అనుమతులు తీసుకున్నారని తెలిపారు. ఈ మొత్తం తతంగంపై విచారణ చేపట్టి అనుమతులు రద్దు చేయాలని, అలాగే నాలా పూడ్చివేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యవర్గ సభ్యులు వి.మాణిక్యం, కె.కృష్ణ, ఎన్.వరుణ్ తదితరులు పాల్గొన్నారు.






