శేరిలింగంపల్లి, మే 29 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలిలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, పర్యావరణ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే గోడపత్రిక (స్టిక్కర్)ను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గచ్చిబౌలి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. లక్ష్మారెడ్డి తన కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ప్రతి ఏడాది మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నినాదం నికోటిన్, పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవాలని పిలుపునివ్వడం అని పేర్కొన్నారు. పొగాకు, పొగాకు ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం, సమాజం, పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 80 లక్షలకు పైగా మంది పొగాకు వినియోగం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం యువత ఎక్కువగా ధూమపానానికి ఆకర్షితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, పొగ త్రాగడం వల్ల ఊపిరితిత్తుల, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, క్షయ, దంతక్షయం, అల్సర్, గ్యాస్ సమస్యలు వంటి అనేక రోగాలు వస్తాయని వివరించారు. పొగాకులోని నికోటిన్ కారణంగా రక్తపోటు, పక్షవాతం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారని తెలిపారు. దేశంలో ధూమపానం కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 13.5 లక్షల మంది మరణిస్తున్నారని పేర్కొన్న ఆయన, సిగరెట్లు, సిగార్లు, గుట్కా, పాన్‌పరాగ్, హుక్కా, బీడీలు, నశ్యం వంటి పొగాకు ఉత్పత్తులను వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారని చెప్పారు. వీటిని ఉపయోగించే వారితోపాటు వారి సమీపంలో ఉండే వారు కూడా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ప్రభావానికి గురై అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
ఒక సిగరెట్ తాగడం వల్ల మనిషి జీవితకాలంలో సుమారు 20 నిమిషాల ఆయుష్షు తగ్గుతుందని పేర్కొంటూ, పొగాకు వినియోగం ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆర్థిక నష్టాలు, ప్రాణనష్టానికి కూడా దారితీస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం, పౌష్టికాహారం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకుని పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు అలవాటును మానాలనుకునేవారు పండ్లు, పండ్లరసాలు, చూయింగ్ గమ్, పుదీనా, పచ్చి కూరగాయలు, తగినంత నీరు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, గోరువెచ్చని పాలు, నిమ్మరసం వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించవచ్చని తెలిపారు. సంకల్పబలం ఉంటే ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం సాధ్యమని, ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎం. శ్రీహరిబాబు, కొత్తపల్లి కోటేశ్వరరావు, అమ్మయ్య చౌదరి, జి.వి. రావు, సత్యనారాయణ, వాణీ సాంబశివరావు, పాలం శ్రీను తదితరులు పాల్గొన్నారు.





