నమస్తే శేరిలింగంపల్లి: బోగి పండగతో ప్రజలందరూ బోగభాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆకాంక్షించారు. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తన నివాసం వద్ద బోగి పండగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ అని ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారన్నారు. అంతే కాకుండా ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారని, ఇంట్లో పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేశారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అనాధికారులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహల మధ్య సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.