నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా లేఅవుట్ లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కాలనీ ప్రతినిధులు వాపోయారు. ఆదివారం ఎపిస్టిమో వికాస్ లీడర్ షిప్ స్కూల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నల్లగండ్ల హుడా కాలనీ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. ఏళ్ల క్రితం వేసిన లే అవుట్ ను ఎక్కడా అభివృద్ధి చేయలేదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 1994లో వేసిన నలగండ్ల హుడా లే అవుట్ కాలనీలో తామంతా ప్లాట్లు కొనుగోలు చేశామని, నేటికి కాలనీని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కనీసం రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు సైతం కల్పించలేదని మండిపడ్డారు. 30 ఏళ్లు గడిచినా కనీస మౌళిక వసతులు లేవని, మురుగునీరు రోడ్లపైనే పారుతుందని, ఈ సమస్యపై జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికితోడు కాలనీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో రాజస్థాన్ కు చెందిన వారు గుంపులు గుంపులుగా గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తరచుగా నలగండ్ల హుడా లే అవుట్ కాలనీలో దొంగతనాలు జరుగుతున్నాయని తెలిపారు. తమ సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి తమకు కనీస సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభాకర్ రెడ్డి, నారాయణ స్వామీ, వేణుగోపాల్,విశ్వనాథ్, బీహెచ్ నాయక్, సురేష్,నాగేశ్వరరావు, నారాయణ, నాగిరెడ్డి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.