నమస్తే శేరిలింగంపల్లి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం ఆరంభం మాత్రమే నగరంలోని మాసబ్ ట్యాంక్ ప్రాంతానికి చెందిన చిలుకల మురళీధర్ 2019లో మియాపూర్ మాతృశ్రీ నగర్ ప్లాట్ నెంబర్ 363లోని స్థలాన్ని డెవలప్మెంట్ కు తీసుకున్నాడు. భవన నిర్మాణం పూర్తవ్వగా కరోనా లాక్ డౌన్ కారణంగా పెయింటింగ్ పనులు పెండింగ్ లో పడి గతేడాది డిసెంబర్ లో పూర్తచేశాడు. కాగా సదరు భవనం గేటుకు తాళంవేసి, అప్పుడప్పుడూ చూస్తుండమని సమీపంలో ఉండే మిత్రుడు శ్రీనివాస్ కి చెప్పాడు. అయితే గత నెల గేటు తాళం విరిగిపోయి ఉండటం గమనించి మురళీధర్ కు సమాచారం ఇచ్చాడు శ్రీనివాస్. ఈ క్రమంలో ఇద్దరు మిత్రులు మంగళవారం సదరు ఇంటికి చేరుకోని పరిశీలించగా నాల్గవ అంతస్థులోని ఎడమవైపు షట్టర్ వద్ద నీలిరంగు కవర్ లో ఏదో చుట్టబడి ఉండటాన్ని గమనించారు.

తెరచి చూడగా ఓ మహిళ మృతదేహాం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. మృతిచెందిన మహిళ 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, మృతదేహం కుళ్లిపోయి ఉండటం వల్ల కొన్ని రోజుల క్రితం మృతిచెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం అక్కడికి ఎలా వచ్చింది..? సదరు మహిళను ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా..? వేరే ఏదైనా మిస్టరీ ఉందా..? అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు మియాపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఎస్ఐ రవి కిరణ్ సూచించారు.





