నమస్తే శేరిలింగంపల్లి: దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ వేర్పాటువాద భావాలను పురిగొల్పుతున్న విచ్ఛిన్నకర శక్తులను ప్రజలంతా సమిష్టిగా తిప్పికొట్టాలని ఆర్‌యస్‌యస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ ఆయుష్ అన్నారు. మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లో సంవిత్ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బెంగాల్ బ్లీడింగ్ ఎమిడెస్ట్ సెక్యూలర్ సైలెన్స్, ఖిలాఫత్ ముస్లీం వేర్పాటు వాదం-దేశ విభజన పేరిట రూపొందించిన పుస్తకాలను ఆయుష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టర్కీలో ఖలీఫా పదవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సాగిన ఉద్యమమే ఖిలాఫత్ అని, ఈ ఉద్యమానికి ప్రపంచంలోని మరే ఇతర ముస్లీం దేశం గానీ, ముస్లీం మతస్తులు గానీ మద్దతు తెలపలేదన్నారు. ఈ ఉద్యమానికి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఖిలాఫత్ కు మద్దతు తెలపడం ద్వారా దేశంలో హిందూ ముస్లీం ఐక్యత సాధించి తద్వారా దేశ స్వాతంత్ర్యం సాధించడం తేలికవుతుందనే ఉద్దేశంతో గాంధీ ఖిలాఫత్‌కు మద్దతు తెలిపేలా కాంగ్రెస్ ను ఒప్పించారన్నారు. గాంధీ ఆలోచన తలకిందులై చివరికి అది ముస్లీం వేర్పాటు వాదానికి దారి తీసి దేశ విభజనకు కారణమైందని తెలిపారు.
1905 సం.లో బెంగాల్ విభజనకు జరిగిన ప్రయత్నాలను బిపిన్ చంద్రపాల్, వీర్‌సావర్కర్, సుభాష్‌చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ తదితర జాతీయ నాయకులు వ్యతిరేకించారని తెలిపారు. బెంగాల్ విభజన అనంతరం సెక్యులరిజం ముసుగులో వందేమాతర గీతం కుదింపు, అనేక దేశాల నుండి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి ముస్లీం చొరబాటు దారుల కారణంగా జరుగుతున్న పర్యావసానాలను ఈ పుస్తకాలలో వివరంగా తెలిపారన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ,అస్సాం, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో చెలరేగుతున్న వేర్పాటు వాద ఆలోచనల గురించి ఈ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ మరో దేశ విభజనకు కారణమయ్యే కుతంత్రాలను సమర్ధవంతంగా అడ్డుకుని దేశాన్ని పరిరక్షించడంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మెడికల్ ఆఫీసర్ చంద్రభూషన్, ప్రతినిధులు కర్లపూడి సత్యనారాయణ, రమణరెడ్డి, విఠల్, హరీష్, ప్రదీప్, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.