నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిల భారత కిసాన్ సంయుక్త మోర్చా నాయకులు ఏఐకేఎఫ్ జాతీయ నాయకులు, ఎంసిపిఐయు పొలిట్ బ్యూరో సభ్యుడు కిరణ్ జిత్ సింగ్ షేఖాన్ అన్నారు. శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని ఓంకార్ భవన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను, మార్కెట్ వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బ కొట్టి కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు రూపొందించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ చట్టాల రూపకల్పన జరిగిన అనంతరం పంజాబ్ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతు చైతన్య కార్యక్రమాలు నిర్వహించి నవంబర్ 26న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని ప్రకటించామని తెలిపారు. ఢిల్లీ నగరం లో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలిపారని నేటికీ నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం అయిందని తెలిపారు. అనంతరం ఎం సిపిఐ యు పొలిట్బ్యూరో సభ్యులు మద్దికాయల అశోక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా ప్రతిఘటించాలని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ఏఐకేఎఫ్ ప్రధాన కార్యదర్శి వల్లెపు ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






