- అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు అవగాహన
- ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన ఆచార్య దాసరి మురళీ మనోహర్
నమస్తే శేరిలింగంపల్లి : అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్ పేట డివిజన్ పరిధిలో ని కల్లం అంజిరెడ్డి ఒకేషనల్ జూనియర్ కళాశాల వద్ద ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆచార్య దాసరి మురళీ మనోహర్ (ఆంగ్ల శాఖాధిపతి, హైదరాబాదు సెంట్రల్ యూనివర్శిటీ) విచ్చేసి యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత అంటేనే ఎనర్జీ, ట్రిగ్గర్ నొక్కిన తరువాత గన్ నుండి దూసుకుపోయే బుల్లెట్ల వంటి వారే యువత అన్నారు.

వారి ఆలోచనలు మెరుపు వేగం.. చేతలలో చురుకుదనం.. తలుచుకుంటే ఏదైనా చేసి చూపించే సత్తా వారి సొంతంమని పేర్కొన్నారు. ప్రస్తుత యువత ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకంజలో ఉన్నారని, ప్రధాన కారణం కృషి, పట్టుదల, ఏకాగ్రతలు లోపించడమేనన్నారు. యువత శరీరం క్లాస్ రూంలో ఉంటే, మనసు మాత్రం బయట విహరిస్తూ ఉండటంతో వారి లక్ష్య సాధనలో సఫలీకృతులు కాలేక పోతున్నారని చెప్పారు.

భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే యువత సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ నిత్య వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం, యోగా వంటి వాటిని పాటిస్తూ, పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, ఒక నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని, ఆ లక్ష్య సాధనకై కృషి, పట్టుదలలతో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ఇన్చార్జి శ్రీనివాస్, విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ధర్మసాగర్, జిల్ మల్లేష్ పాల్గొన్నారు.