- జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ ఎసిపి శ్రీధర్, ఏసిపి శ్రీనివాస్ రావు లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ డా. మాధవ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాలని, సమాజంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకురావాలని, అదేవిధంగా విమర్శలు, సద్విమర్శలు ఉండాలని కోరుకునే వారిలో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుంది. ఆ ఉద్దేశంతోనే తనలాంటి యువకులకు సైతం పార్టీలో తగిన ప్రాధాన్యం ఇచ్చి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాలపై కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలపై కావచ్చు వ్యవస్థాపరంగా, చేయాల్సిన సంస్కరణలపరంగా, సామాన్య ప్రజానీకానికి అందాల్సిన పథకాల పరంగా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్రను పోషిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు ప్రతిపక్ష నాయకుడు అనే బాధ్యతతో ప్రభుత్వాన్ని సకారాత్మకమైన దిశలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు వైఎస్ఆర్సిపి పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల వాడుతున్న భాషా, అసభ్య పదజాలం రాజకీయాల్లోకి వచ్చిన యువత ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయా సోషల్ మీడియా హ్యాండిల్ అడ్మిన్లను గుర్తించి, గుర్తించిన పేజీలను నిషేధించి, ఆయా అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్లకి, రాష్ట్రపతి కి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నాయకులు బి.అరుణ్ కుమార్, కళ్యాణ్ చక్రవర్తి, దాక్షాయిని,హనుమంతు నాయక్, సందీప్, ఉపెండర్, నరేష్, ప్రవీణ్, అక్బర్, దుర్గ ప్రసాద్ మరియు ఇతర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.