నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్న నలుగురు వ్యక్తులను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేసి 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన షేక్ సలావుద్దీన్(52) టెంట్‌హౌస్ నిర్వహిస్తుంటాడు. ఇతడు అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి షేక్ జావీద్(46)తో కలిసి సంవత్సర కాలంగా రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయసాగాడు. సమీప ప్రాంతాల్లోని పేద ప్రజల నుండి రేషన్ బియ్యాన్ని రూ.8 కి కొనుగోలు చేసి జహీరాబాద్ ప్రాంతంలో పౌల్ట్రీ వ్యాపారులకు రూ.14 కు విక్రయించసాగారు. మంగళవారం రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు మియాపూర్ చందానగర్ జాతీయ రహదారిపై ఆర్‌యస్ బ్రదర్స్ షోరూం వద్ద బియ్యాన్ని తరలిస్తున్న లారీ (జిజె 10టిటి 9844)ని సీజ్ చేసి డ్రైవర్ నాయ్ అదామ్ గుల్ మొహమ్మద్, క్లీనర్ ఈశ్వర్‌లతో పాటు సలావుద్దీన్, జావీద్‌లను అదుపులోకి తీసుకున్నాన్నారు. నిందితులు తరలిస్తున్న 22, 965 కిలోల బియ్యంతో పాటు రూ.40 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లతో పాటు స్విఫ్ట్ కారు టిఎస్ 08 ఎఫ్‌కె 9338 సీజ్ చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు.