- గుల్మోహర్పార్క్ కాలనీలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా ఓ ప్రైవేటు వ్యక్తి చేపట్టిన బండరాళ్ల తొలగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. జెసిబి సహాయంతో బండరాళ్ల తొలగింపు చేపడుతుండగా ఓ పెద్ద బండరాయి ప్రక్కనే ఉన్న ఇంటి ప్రహరీగోడపై పడిపోయింది. అదృష్టవశాత్తు సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. శేరిలింగంపల్లి గుల్మోహర్ పార్కు కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితులు, కాలనీవాసుల కథనం ప్రకారం… కాలనీలోని ప్లాటు నెంబరు 232లో బిహెచ్ఇఎల్ ఉద్యోగి నర్సింలు తన కుటుంబంతో నివాసముంటున్నాడు. వీరి ఇంటికి ఆనుకుని ఉన్న 233 ప్లాట్నెంబరు స్థలంలో బొమ్మనపల్లి బెంజిమన్ అనే వ్యక్తి ప్లాటులోగల పెద్ద బండరాళ్లను తొలగించి చదును చేసేందుకు ప్రయత్నించగా ఇరుగుపొరుగు వారు అభ్యంతరం తెలిపారు. దీంతో చుట్టుప్రక్కల ఇండ్లకు ఎటువంటి నష్టం వాటిళ్లకుండా జాగ్రత్తగా బండరాళ్లను తొలగిస్తామని గుల్మోహర్పార్కు సొసైటీ సభ్యుల సమక్షంలో ఒప్పందం చేసుకుని గురువారం పనులు ప్రారంభించారు. బండరాళ్లను జెసిబి సహాయంతో తాడుతో తొలగిస్తున్న క్రమంలో ఓ పెద్ద బండరాయి నర్సింలు ఇంటిపై కూలడంతో ప్రహరీ పూర్తిగా ద్వంసమైంది. సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయాన్ని ప్లాటు యజమానికి తెలిపే ప్రయత్నం చేసినప్పటికీ స్పందించలేదని బాధితులు తెలిపారు. అనంతరం చందానగర్ పోలీసులకు విషయం తెలపడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
పెద్ద ప్రమాదమే జరిగేది: నర్సింలు కుమారుడు నరేష్
ఘటన జరిగినప్పుడు పిల్లలతో సహా ఇంట్లోనే ఉన్నాం. బండరాయి గోడపై కూలినా, ఇంటిపైకి దూసుకొచ్చినా ప్రాణాపాయం జరిగి ఉండేది. ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ముందునుండీ అభ్యంతరం చెప్పాం. అయినా మా మాటను లెక్క చేయకుండా పనులు చేపట్టారు. జిహెచ్ఎంసి, మైనింగ్ అధికారుల అనుమతులు కూడా తీసుకోలేదు. సొసైటీ సభ్యుల సమక్షంలో జరిగిన ఒప్పందంలో చెప్పిన విధంగా కాకుండా సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా నిర్లక్ష్యంగా పనులు చేపట్టారు. వాస్తవానికి బండరాళ్లు ఉన్న స్థలాన్ని ఎమినిటీస్ కింద వదులుతామని గతంలో చెప్పారు. ఇప్పుడు చదును చేసి వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.