హెచ్ ఎండీఏ భూములను అక్రమిస్తే కఠిన చర్యలు

  • ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు : హెచ్ ఎండీఏ, రెవెన్యూ, పోలీసుల హెచ్చరిక

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టిపరిస్థితిల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి అన్నారు.

ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి 

మియాపూర్ భూముల ఆక్రమణకు యత్నిస్తున్న వారిని ఉద్దేశించి శేరిలింగంపల్లి తహశీల్దార్, డిప్యూటీ కలెక్టర్ వెంకారెడ్డి, అడిషనల్ డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు మాట్లాడారు.

కొద్ది రోజులుగా మియాపూర్ సర్వే నెంబర్ 100,101లో కొందరు ముఠాలుగా ఏర్పడి సామాన్య జనాలను ఉసిగొల్పి గుడిసెలు వేయిస్తున్నారని, వారిని నమ్మి నగరంలోని ఆయా ప్రాంతాల నుండి రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి భారీగా జనాలు తరలివచ్చి ఆక్రమణలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. మియాపూర్ 100, 101 సర్వే నెంబర్ లలోని 500ల పై చిలుకు భూములన్నీ హెచ్ ఎండీఏ ఆధీనంలో ఉన్నాయని, వాటిని పరిరక్షించే బాధ్యత తమదేనని హెచ్ ఎండీఏ ఎస్టేట్ అధికారి వీరారెడ్డి తెలిపారు. ఈ భూములు ప్రభుత్వానివే అన్న విషయం తెలియక 16 మంది బాధితులు కొన్నారని, వీటిపై గతంలో కేసులు వేయగా.. ఈ భూములు ప్రభుత్వానివేనని 2003లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని, అయితే భూములు కొనుగోలు చేసిన వారు సుప్రీంకోర్టుకు వెళ్లారని ఇప్పుడు అక్కడ కేసులు నడుస్తున్నట్లు తెలిపారు.

కొందరు వ్యక్తులు కావాలని జనాలను రెచ్చగొట్టి, వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరి ప్రలోభాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేసుకునేందుకు యత్నిస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మద్దని హెచ్ ఎండీఏ అధికారులు కోరారు. కబ్జాలకు యత్నిస్తే కేసులు నమోదు చేస్తామన్న వీరారెడ్డి మే నెలలో 4 కేసులు పెట్టామని,  ప్రస్తుతం కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. మియాపూర్ లోని హెచ్ ఎండీఏ భూముల పరిరక్షణ కోసం 40 మంది సెక్యూరిటీ అందుబాటులో ఉన్నారని, ఆక్రమణలను నిరోధించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆయన రెవెన్యూ, పోలీసు, హెచ్ ఎండీఏ అధికారులు కలిసి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు కావాలంటే రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని, వారు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారన్నారు. కబ్జాదారులను అడ్డుకునేందుకు భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here