- ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెచ్.ఐ.విపై అవగాహన
- ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని, విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య ఆరోగ్యశాఖ, డిప్యూటీ పారామెడికల్ విశ్రాంత అధికారి కె. నాగభూషణం
నమస్తే శేరిలింగంపల్లి : బి. హెచ్. ఈ. ఎల్ టౌన్ షిప్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థిని, విద్యార్థులకు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ హెచ్. ఐ. వి / ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిఖిత్ అంజూమ్ అధ్యక్షత వహించగా.. వైద్య ఆరోగ్యశాఖ, డిప్యూటీ పారామెడికల్ విశ్రాంత అధికారి కె. నాగభూషణం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
“ప్రపంచంలో కొన్ని రకాల వ్యాధులు, వైరస్ లకు ఎన్నో సంవత్సరముల నుండి మందులను కనిపెట్టలేకపోతున్నాము” అన్నారు. “1980లో హెచ్. ఐ. వి / ఎయిడ్స్ వైరస్ ను గుర్తించినప్పటికీ నేటి వరకు దీనికి శాశ్వత నివారణకు మందును కనిపెట్టలేక పోతున్నామని, కానీ కొన్ని రకాల మందులతో ఈ వ్యాధిని కట్టడి చేయగలుగుతున్నా మని తెలిపారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హెచ్ఐవీ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు. ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించి ప్రజలను ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా చూడటమే లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉన్నప్పుడే జీవితంలో అనుకున్నది సాధించ గలుగుతామని, ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించవద్దని, అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి వారి సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఫర్హాత్, డాక్టర్ ఆర్. వి. జి. కె. మోహన్, డాక్టర్ జ్యోతిర్మయి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, జనార్ధన్, బాలన్న, జిల్ మల్లేష్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.