- రూ. 7 కోట్ల 41 లక్షలతో ఈర్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి : హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఈర్ల చెరువు సుందరీకరణ, సంరక్షణ, అభివృద్ధి పనులలో భాగంగా రూ. 7 కోట్ల 41 లక్షలతో మురుగు నీటి మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు, రూ. 32 లక్షల అంచనా వ్యయంతో బతుకమ్మ ఘాట్ నిర్మాణము పనులకు కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ చెరువు లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులకు శంకుస్థాపన చేశామని, వైశాలి నగర్ నుండి ఈర్ల చెరువు అలుగు వరకు డ్రైనేజి వ్యవస్థ మల్లింపు కాల్వ నిర్మాణం పనులకు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. చుట్టుపక్కల కాలనీల నుండి వచ్చే మురుగు నీరు చెరువులో కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ,చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మురుగు నీటి కాల్వ పై స్లాబ్ లు వేయాలని తెలిపారు.
బతుకమ్మ ఘాట్ ను బతుకమ్మ పండుగ లోపు పనులు పూర్తి చేయాలని, బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళ సోదరిమణులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, మౌలిక వసతులు కలిపించాలని, సకల హంగులతో నిర్మించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు డీ ఈ నళిని, ఏ ఈ పావని, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.