సైబరాబాద్(నమస్తే శేరిలింగంపల్లి): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన క్షతగాత్రులకు మొదటి గంటలో అందించే వైద్య సేవలు వారి ప్రాణాలను నిలబెడతాయని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్‌కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాద బాదితులను ఆసుపత్రికి తరలించేలోగా వారికి ప్రథమ చికిత్స అందించేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన సేవియర్ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం సైబరాబాద్ సిటిసిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు సమీపంలో ఉండే పౌరులు, పోలీసు సిబ్బందికి ప్రథమ చికిత్స పై శిక్షణ అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ సైబరాబాద్ పరిధిలో ప్రతీ నెల సగటున 25-30 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, వారికి సరైన సమయంలో చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం నుండి కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగే కూడళ్ల వద్ద ఉండే పోలీసు, పెట్రోలింగ్ సిబ్బంది, దాబాలు, పెట్రోలు బంకుల్లో పనిచేసే ఉద్యోగులు, దుకాణదారులు, సెక్యూరిటీ గార్డులకు ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు, రక్తస్త్రావాన్ని అరికట్టే పద్దతులు, సిపిఆర్, క్షతగాత్రులను ఆసుప్రతులకు తరలింపు తదితర అంశాలపై శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రోజు విడిచి రోజు 30 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మొదటి బ్యాచ్ సేవియర్ శిక్షణ పూర్తయినట్లు తెలిపారు. రోడ్డు భద్రత పట్ల సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సిఎస్‌సి తీసుకుంటున్న చర్యలను కేర్ ఆసుపత్రి వైద్యులు డా.విజయానంద్ అభినందించారు.