- గోకుల్ ప్లాట్స్ కాలనీలలో పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన
నమస్తే శేరిలింగంపల్లి : పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్యకర వాతావరణానికి పచ్చని చెట్లు ఎంతో దోహదపడతాయని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలలో రూ.8 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే సీడీపీ, ఎడ్డి ప్రత్యేక నిధులతో పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పార్క్ సుందరీకరణ, అభివృద్ధి నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గోకుల్ ప్లాట్స్ పచ్చని చెట్లతో విరాజిలెందుకు గోకుల్ ప్లాట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. పార్కులో పూలు, పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా గోకుల్ ప్లాట్స్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గోకుల్ ప్లాట్స్ లో అందరూ ఐకమత్యంగా ఉంటూ రాష్ట్రంలోని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేసేందుకు అసోసియేషన్ కృషి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.