కంట్లో కారం.. నోట్లో బెల్లంలా రాష్ట్ర బడ్జెట్ : యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

  • పిబ్రవరి 14-20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమరజీవి తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల నోట్లో బెల్లం పెట్టీ కంట్లో కారం కొట్టినట్లు ఉందని యంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. ప్రజా సంక్షేమం పేరుతో 2023-24 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సామాజిక వర్గాలకు ఎలాంటి ఉపయోగకరమైన బడ్జెట్ కాదని అన్నారు. గత బడ్జెట్ లాగానే అంకెల గారడితో నిండి ఉన్న ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోట్లాను కోట్ల రూపాయల లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం చెపుతుంటే ఇది ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కాకపోతే ఈ బడ్జెట్ అంశాలు ప్రజల కంట్లో కారం కొట్టి నోట్లో బెల్లం పెట్టిన విధంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో సగం భాగం ఉన్న బీసీ సామాజిక వర్గానికి అటు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇటు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో సంక్షేమానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలో చేపడుతున్న బీసీ జనగణలాగానే తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణ చేపట్టడానికి ఏమి అడ్డంకులని ప్రశ్నించారు.

రాష్ట్ర కమిటీ సభ్యుడు అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కార్పొరేషన్ నిధులను పక్కదారి మళ్లించి అభివృద్ధి పేరుతో కాలయాపన చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర బడ్జెట్లో ప్రజలకు సామాజికపరంగా అన్ని విధాల అభివృద్ధికి శాస్త్రీయమైన నిధులు కేటాయించకపోతే ప్రజా ఆందోళన తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

  • ఫిబ్రవరి 14 -20 వరకు అమరజీవి తాండ్రకుమార్ ప్రధమ వర్ధంతి..

యంసిపిఐ(యు) పొలిట్ బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తూ మరణించిన అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమార్ ప్రధమ వర్ధంతి కార్యక్రమాలు ఫిబ్రవరి 14 – 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని గాదగోని రవి వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 14న మియాపూర్ లోని తాండ్రకుమార్ స్మారక స్థూపం నుండి ముజాఫర్ అహమ్మద్ వరకు భారీ ప్రదర్శన, అనంతరం ముజాఫర్ అహ్మద్ నగర్ లో తాండ్ర కుమార్ విగ్రహావిష్కరణ, ప్రధమ వర్ధంతి సభ జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి యంసిపిఐ (యు) భారత ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు అనుభావదాస్ శాస్త్రి లతోపాటు కమ్యూనిస్టు వామపక్ష సామాజిక పార్టీలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు అలాగే వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ప్రజలు హాజరవుతారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర బడ్జెట్లో ఇంటి బంధు పథకం ప్రవేశపెట్టాలని యం సి పి ఐ (యు) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, వనం సుధాకర్, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, వి. తుకారాం నాయక్, పెద్దారపు రమేష్, కన్నం వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు మైధం శెట్టి రమేష్, గాదె మల్లేష్, తాండ్ర కళావతి, పి. భాగ్యమ్మ, పల్లె మురళి, వస్కుల సైదమ్మ, జబ్బర్ నాయక్, ఈ కిష్టయ్య, కర్రోల్ల శ్రీనివాస్, కంచ వెంకన్న పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here