నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు

  • మేఘాలయాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల తయారీ
  • రంగంలోకి దిగిన ఎస్ ఓ టి – అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. రిమాండుకు తరలింపు
  • పెద్ద ఎత్తున నకిలీ దృవీకరణ పత్రాలు, సామాగ్రి స్వాధీనం
  • పోలీసులను అభినందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

నమస్తే శేరిలింగంపల్లి : నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి చేశారు. ఆయన కథనం ప్రకారం.. విశాఖపట్నం వాసి షేక్ కాజా నాయబ్ రసూల్ మియాపూర్ లో నివసిస్తున్నాడు. నాలుగు నెలల కిందట నగరానికి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు. అయితే తాను డిగ్రీ చేయాలనుకుంటున్నానని చైతన్యపురిలో ఉంటున్న తనకు తెలిసిన ప్రేమ్ కుమార్ (29)కు తెలిపాడు. ఇందులో భాగంగా సికింద్రాబాద్లో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న గరికపాటి వెంకట భాస్కర సత్యనారాయణ శర్మ అలియాస్ శర్మ (49)ను పరిచయం చేయించాడు. శర్మ దగ్గరికి వెళ్లిన షేక్ కాజా తాను దూరవిద్య ద్వారా బీఎస్సీ (ఐటీ) కోర్స్ చేయాలనుకుంటున్నానని అతడికి తెలిపాడు. దీంతో శర్మ తనకు మేఘాలయలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పనిచేసే అఖిలేష్ ప్రవీణ్ తెలుసునని వారు ఆన్ లైన్ ద్వారా పరీక్ష రాయిస్తారని చెప్పాడు. షేక్ కాజా ఒప్పుకోవడంతో.. ఇందుకోసం రెండు లక్షల రూపాయల ఫీజు కట్టాల్సి వస్తుందని, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇంటర్ మెమో, ఐడి ప్రూఫ్ తదితర పత్రాలు సమర్పించాలని ఖాజాకు ప్రేమ్ కుమార్ వివరించాడు. వెంటనే పత్రాలు అందజేసి, రెండు లక్షల ఏడు వేల రూపాయల నగదును ప్రేమ్ కుమార్ ఫోన్ పే (9701041841) నంబర్ కు పంపించాడు. కొన్ని రోజుల తర్వాత 2014-16 సంవత్సరానికి సంబంధించిన మేఘాలయా యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్లను ప్రేమ్ కుమార్ వాట్సప్ ద్వారా కాజాకు పంపించాడు. పరీక్ష రాయకుండానే సర్టిఫికెట్లు పంపడంతో ఖాజాకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలించటంతో అవి నకిలీవని తేలింది. దీంతో షేక్ ఖాజా మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును స్వీకరించిన మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగి నకిలీ సర్టిఫికెట్ల గుట్టును బట్టబయలు చేశారు. వీటి తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రేమ్ కుమార్, శర్మను అదుపులోకి తీసుకొని విచారించారు. మేఘాలయలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన మాజీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అఖిలేష్ సహాయంతో నకిలీ సర్టిఫికెట్ల తంతు కొనసాగిస్తున్నామని, ఇప్పటివరకు 430 నకిలీ సర్టిఫికెట్లను జారీ చేశామని విచారణలో ఒప్పుకున్నారు. వీరు వద్ద నుంచి పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల గుట్టు బయటపెట్టి నిందితులను అరెస్టు చేసిన పోలీసులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.

నకిలీ సర్టిఫికెట్ల వివరాలను వెల్లడిస్తున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసున్న నకిలీ సర్టిఫికెట్లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here