కరోనా?! తస్మాత్ జాగ్రత్త!

కరోనా! చాలా విచిత్రంగా ఉంది!
నీ ముఖం ఎలా ఉంటుందో
నీ ముక్కు ఎలా ఉంటుందో
నీ అందచందాలు ఎలా ఉంటాయో తెలియదు
కానీ, మాకు తెలియకుండానే,
మా కంటికి కనపడకుండానే
మా కళ్లు తెరిపించావు.

భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు
ఉన్నాడని అందరూ నమ్మరు
కానీ నీవు మాత్రం కంటికి కనపడకున్నా
నీవు తీసే ప్రాణాలు చూసి నీవు
ఉన్నావని అందరూ నమ్ముతున్నారు

ఆస్తులు, అంతస్తులు, అద్దాల మేడలు
ఖరీదైన బట్టలు, కార్లు, బ్యాంకు బ్యాలెన్సులు
ఏవీ ప్రాణాల్ని కాపాడలేవని
బంధువులు, స్నేహితులు, డాక్టర్లు, ఎవరు కూడా రక్షించలేరని
ప్రాణం కన్నా విలువైంది ఏదీ లేదని
సామాజిక దూరం, ‘ఫేస్ మాస్క్’ లే శ్రీరామ రక్ష
అని భోధించిన గొప్పగురువువు నీవే!

కరోనా ! అందుకే నేమో డబ్బు చూసి గర్వపడవద్దని
“మాయ మైపోతున్నాడు మనిషి అన్నవాడు
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు”
అని అందే శ్రీ పాట రాసినప్పటికీ
దాతలు కదిలి, దానధర్మాలు చేయడం
ముమ్మాటికీ నీ చలువే!
ఈ వ్యవస్థ దరిద్రుల సంఖ్య తగ్గించక పోయినా,
నీవల్ల నైనా దాతల ద్వారా
దరిద్రుల సంఖ్య తగ్గుతుంధన్న ఆశ
అన్ని వ్యవస్థలపై ఆశలు వదిలి కరోనా వ్యవస్థపై
ప్రజలు ఆశలు పెంచుకుంటారేమో వేచి చూడాలి.!

కరోనా నీవు ఎంత ప్రబలినా
ఎన్ని ప్రాణాలు తీసినా
నాయకులలో మార్పు రావడం లేదు!
పదవుల మీద ఆశ అలాగే ఉంది.
డబ్బు మీద బెంగ చెక్కుచెదరలేదు.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.
నిస్వార్ధం అటకేక్కిoది, స్వార్ధం తెరకెక్కిOది!
పచ్చగా ఉన్న చోట తిని
వెచ్చగా ఉన్న చోట సేద తీర్చుకుంటున్నారు
కోట్లు కూడబెట్టి కోటిశ్వర్లతో పోటీపడటం
ఆస్తులు ఆమాంతం పెంచుకోవాలనే ఆర్తి
నీ లానే పెరుగుతూనే ఉంది
ఏ నాయకుడు కూడా నెల నెల పొందే
కోట్ల జీత భత్యాలు త్యాగం చేసేట్లు లేదు. వినేట్లు లేదు.
త్యాగం అనాధయి, ఎవరికి పట్టని బిడ్డయింది!
కరోనా ! నీ పుణ్యమాని
వారిలో మార్పువస్తే దేశాభివృద్ధిలో
స్థూల జాతీయోత్పత్తితో పాటు
నీ లెక్కకూడా అధికారికంగా అచ్చయి పోతుంది.!

కరోనా !చివరికి నీ మేలు కోరి ఒక మాట మాది
జాతి గుండెల్లో నీదైన శైలిలో
చెరగని ముద్ర వేసావు
రాజుదైన బంటుదైన
గమ్యం ఒకటేనని తేల్చి చెప్పావు
ఇక నీవు వచ్చి చేసింది చాలు! చెప్పింది చాలు
మేము నేర్చుకుంది కూడా చాలు!
ఇక నీవు వద్దంటే మా కొద్దు
మేము వీడ్కోలు చెప్పక ముందే
నీవల్ల మా సమస్యలు వేయి రేట్లు పెరగక ముందే
అడ్రసు లేకుండా తుర్రుమని పారిపో.
లేకుంటే మా డాక్టర్లు నిన్ను పట్టి
చిత్ర హింసలు పెట్టి, పొడిసి చంపి
నిన్ను ఇక్కడే బొంద పెడతారు
ఇక నీ ఇష్టం
తేల్చుకోవాల్సింది నీవే, నీవే,నీవే,
తస్మాత్ ! జాగ్రత్త !

SK.ఖాసీం,
రిటైర్డ్ ప్రిన్సిపాల్,
గుల్ మోహర్ పార్క్ కాలని అధ్యక్షుడు,
జన విజ్ఞానవేదిక శేరిలింగంపల్లి కమిటి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here