- వికలాంగులకు 24, ఎస్సీలకు 83, ఎస్టీలకు 29, ఇతరులు 364 లబ్ధిదారులకు పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి :హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో 2వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కోసం ఆన్లైన్ డ్రా కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజక వర్గానికి 500 చొప్పున డబుల్ ఇండ్ల పంపిణీ చేపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా కార్యక్రమంలో మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్ గౌడ్ , మాగంటి గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, కలెక్టర్లు అనుదీప్ దూరిశెట్టి, హరీష్, అమోయ్ కుమార్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించినట్టు తెలిపారు. మొదటి దశలో 11,700 వేల ఇండ్లను పేదలకు అందించామని, ఈనెల 21వ తేదీన రెండవ దశలో దాదాపు మరో 13,300 ఇండ్లను అందించనున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వికలాంగులకు 24, ఎస్సీలకు 83, ఎస్టీలకు 29, ఇతరులకు 364 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఉచితంగా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 15 న రెండవ దశ ఇండ్ల కేటాయింపు డ్రా తీశామని, 21వ తేదీన ఇండ్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.