ఎప్పుడు ట్రిమ్ చేసిన గడ్డం తో కనిపించే మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పొడుగైన గడ్డం, జుత్తు తో కనిపిస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా..? కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన నుండి ప్రధాని మోదీ క్షవరం చేయించుకోకుండా గడ్డం, జుత్తును పెంచేస్తున్నారు. అయన వేషధారణ పై ఎంతోమంది అనేక రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఇలా చేయడంపై సరైన కారణాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు.
ఈ విషయం పై నెటిజన్లు వివిధ మాధ్యమాలలో తమదైన శైలిలో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మోదీ శాంత క్లూస్ లాగా మారి క్రిస్టమస్ కానుకగా దేశ ప్రజలకు వ్యాక్సిన్ ను బహుమతిగా ఇవ్వనున్నాడని ఒక వ్యక్తి ట్విట్టర్ లో చమత్కరించగా, బాబర్ మాదిరిగా వేషధారణ ఉందంటూ మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కొందరేమో ఋషి లాగా అభివర్ణిస్తుండగా, ఇంకొందరు ఛత్రపతి శివాజీ రూపంతో పోల్చుతున్నారు.
అయితే ప్రముఖ వ్యక్తుల వేషధారణ, అలవాట్లు వారి ఆలోచనలను, నిర్ణయాలను ప్రతిబింబిస్తాయి అని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ఇదే తరహాలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఇటీవలి కాలంలో గడ్డం పెంచడం గమనించవచ్చు. అయితే క్రిస్టఫర్ ఓల్డ్ స్టోన్ మోరె అనే రచయిత తన పుస్తకం మెన్ అండ్ బియర్డ్ లో ప్రముఖుల వేషధారణకు గల కారణాలను వివరిస్తూ కొందరు ప్రముఖులు ఏదైనా ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునే వరకు గడ్డం పెంచుతారని పేర్కొన్నాడు. రోజు అద్దంలో చూసుకున్నప్పుడు వారు సాధించాల్సిన లక్ష్యాలను గడ్డం గుర్తు చేస్తుంది అనేది అతని భావన. దీనికి క్రిస్టోఫర్ టైం బియర్డ్ అని నామకరణం చేశాడు. అయితే కరోనా దేశంలో విస్తరించిన నాటి నుండి ప్రధాని మోదీ గడ్డం పెంచడం తో దేశ ప్రజలను ఈ ఉపద్రవం నుండి రక్షించే వరకు గడ్డం తీయకూడదని సంకల్పించుకున్నట్లు మనం భావించవచ్చు. ఇది ఒక రకంగా తిరుపతిలో మనం సమర్పించే తలనీలాల మొక్కు లాగా అర్ధం చేసుకోవచ్చు.
అయితే మెన్ అండ్ బియర్డ్ పుస్తకంలో మరో రకమైన అంశం కూడా ఉంది. ఏదైనా సంక్షోభ సమయంలో దేశాధినేతలు తమ వ్యక్తిగత పనులను సైతం పూర్తి చేసుకోలేనంతగా తీరిక దొరకదు కావున ఇలా గడ్డం పెంచేస్తుంటారని అంటాడు క్రిస్టోఫర్. ప్రస్తుతం మన దేశానికి చైనా తో విబేధాలు ఉన్న కారణంగా వివాదాలు సమసిపోయి దేశం సురక్షిత వాతావరణం ఏర్పడే వరకూ దేశాధినేతలు ఇలా వ్యవహరిస్తుంటారనేది మరో అభిప్రాయం. ఏదేమైనా దేశ ప్రజల మేలు కోసం ప్రధాని మోడీ సంకల్పించిన లక్ష్యాలు పూర్తవ్వాలని ఆశిద్దాం.