- చికిత్సలోని నూతన విధానాల పట్ల శిక్షణ అందించిన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ పి. శ్రీధర్, డాక్టర్ దామోదర్‌రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : గుండె వైద్యులకు ఆధునిక సాంకేతికతతో కూడిన నైపుణ్యాభివృద్ధికి దోహదపడేందుకు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో డీకోడింగ్ CTO (Coronary Total Occlusion ) వైద్య పరిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సీటీఓ పట్ల డాక్టర్లకు మరింత మెరుగైన అవగాహన కల్పించడంతో పాటుగా ఈ చికిత్సలోని నూతన విధానాల పట్ల శిక్షణ అందించడం కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. డీకోడింగ్ CTO వర్క్‌షాప్–2022 కు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి నేతృత్వం వహించారు . ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌లు డాక్టర్ శరత్ రెడ్డి, డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ దామోదర్ రెడ్డి నూతన ప్రక్రియలను వివరించడంతో పాటుగా ప్రత్యక్షంగా చికిత్స విధానాలను గురించి చెప్పారు. భారతీయులలో జన్యుపరమైన కారణాల వల్ల కార్డియోవాస్క్యులర్ వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. తగిన వ్యాయామాలు చేయడం, ఆహార నియమాలు పాటించడం వల్ల ఈ వ్యాధుల బారిన పడకుండా కొంత మేర కాపాడుకోవచ్చు. సమస్య మోస్తరుగా ఉంటే మందులు వాడటం, మరీ ఎక్కువగా ఉంటే స్టెంటింగ్, బైపాస్ లాంటి ప్రక్రియలను అనుసరించడం చేస్తారు. అయితే క్రానిక్ టోటల్ అక్లూషన్ (సీటీఓ) కేసులు ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొరొనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఇప్పుడు సీటీఓ బాధితులేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం, కుటుంబ చరిత్ర, అధిక కొలెస్ట్రాల్, నిశ్చల జీవనశైలి లాటి సీఏడీ లక్షణాలతో పాటుగా గతంలో బైపాస్ సర్జరీ కావడం లేదా హార్ట్ ఎటాక్స్ సంభవించడం కూడా సీటీఓకు కారణమతున్నాయి.
- సీటీఓ అంటే..
క్రానిక్ టోటల్ అక్లూషన్.. సాధారణంగా సీటీఓ అంటారు. ఈ స్ధితిలో గుండె నాళాలు పూర్తిగా మూడు నెలలకు పైగా మూసుకుపోయి ఉంటాయి. ఈ స్ధితిలో గుండెకు రక్త ప్రవాహం సరిగా జరగదు. ఒకవేళ దీనికి తగిన చికిత్స అందించకపోతే ఛాతీలో నొప్పి, త్వరగా అలిసిపోవడం, నీరసం వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సాధారణంగా సీఏడీ తో బాధపడుతున్న రోగులలో ఈ సీటీఓ కూడా కనిపిస్తుంటుంది. ఓ అధ్యయనం ప్రకారం పెద్ద వయసు వ్యక్తులు అంటే 85 సంవత్సరాలు దాటిన వారిలో 41% మంది 65 సంవత్సరాలు దాటి 79 సంవత్సరాలు లోపు వారిలో 40% మందికి, 65 ఏళ్ల లోపు వారిలో 37% మందికి సీటీఓ సమస్య ఏర్పడవచ్చు.
- సీటీఓ గుర్తించడమెలా…
సీటీఓను పలు రకాల పరీక్షల ద్వారా గుర్తిస్తారు. భౌతిక పరీక్షలు లేదంటే ఎక్స్ రే ఇమేజింగ్, ఈకెజీ, స్ట్రెస్ టెస్ట్, ఎంఆర్‌ఐ, ఎకోకార్డియోగ్రామ్ పరీక్షలు వంటివి వీటిలో ఉంటాయి.
- సీటీఓ చికిత్స…
సీటీఓ చికిత్స విధానంలో లక్షణాలు తగ్గించడం, గుండెపోటు రాకుండా చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. సీటీఓ లక్షణాల తీవ్రతను బట్టి ఈ చికిత్స కూడా ఉంటుంది. సీటీఓ చికిత్సలో ముఖ్యంగా పీసీఐ, సీఏబీజీ చేయడం ఉంటాయి. అయితే సీఏబీజీ (బైపాస్ సర్జరీ) లో ఉన్న సంక్లిష్టతల కారణంగా ప్రీకాషనియస్ కొరొనరీ ఇంటర్వెన్షన్ (పీసీఐ) ప్రోసీజర్ అనుసరిస్తున్నారు. ఇటీవలి కాలంలో సీటీఓ పీసీఐ చికిత్సలలో సక్సెస్ రేట్ (దాదాపు 86%) అధికంగా ఉండటం వల్ల దీనిని అనుసరిస్తున్నారు.