– మొదటిరోజు స్వర్ణాలంకృత దుర్గాదేవి, బాలా త్రిపురసుందరి దేవి, మహాలక్ష్మి అవతారాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా వివిధ దేవాలయాల్లో మొదటి రోజు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. చందానగర్ లోని విశాఖ శారదా పీఠ పాలిత వెంకటేశ్వర ఆలయం సముదాయంలోని భవాని మాత నేడు మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, సీతం రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి అమ్మవారికి అర్చనలు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీప్తి శ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రం లో భారతీయం సత్యవాణి స్వయంగా అమ్మవారిని స్వర్ణ అలంకృత దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. చందానగర్ అన్నపూర్ణ ఎంక్లేవ్ లోని సాయిబాబా దేవాలయంలో, శిల్ప ఎంక్లేవ్ లోని లక్ష్మీ గణపతి దేవాలయంలో, అదేవిధంగా తారానగర్ లోని తుల్జాభవాని అమ్మవార్లు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేశారు.
గంగారం హనుమాన్ దేవాలయంలోని అమ్మవారు, నెహ్రూ నగర్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిలు స్వర్ణాలంకృత దుర్గాదేవిగా విశేష పూజలు అందుకున్నారు. కాగా ఆయా ప్రాంతాల్లోని భక్తులు మొదటి రోజు నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.