నమస్తే శేరిలింగంపల్లి: కోరికలుంటే శవం… వాటిని త్యజిస్తేనే శివం… అంటు తన వాక్చాతుర్యంతో ప్రవచన ప్రియులను కట్టిపడేశారు గరికపాటి నర్సింహరావు. చందానగర్ శిల్పా ఎన్‌క్లేవ్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ ప్రాంగణంలో మూడవ రోజు లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ గరికపాటి నర్సింహారావు శివస్తుతి అంశంపై ప్రవచనం చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వందల సంఖ్యలో హాజరై గరికపాటి వ్యాఖ్యానాన్ని ఆసక్తిగా విన్నారు.
గరికపాటి మాట్లాడుతూ సత్వ, రజ, తమో గుణాలను మూడు పోగులుగా మార్చి, ఆ వత్తిని దగ్ధం చేయడమే దీపం వెలిగించడంలోని పరమార్ధమని అన్నారు. కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగించామన్నది ముఖ్యం కాదు, భగవత్ స్మరణలో ఎంత లీనమై దీపం వెలిగించామన్నదే ముఖ్యమని అన్నారు. నిజానికి భగవంతుడు నిరాకార స్వరూపుడని, ఆ తత్వాన్ని తెలుసుకునేందుకు కొన్ని రూపాలను పూజించడం జరుగుతుందని తెలిపారు. భగవంతుడి కన్న సత్యం గొప్పదని, కావున సత్యశీలురకు దేవుడు అండగా ఉంటాడని అన్నారు. యాంత్రికత పెరిగిన కొద్ది సమాజంలో రక్షణ కరువవుతున్నదని, స్మార్ట్‌ఫోన్‌ల మత్తులో పడి యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన భాద్యత మరింత పెరిగిందని, ఐతే తమ పిల్లల విషయంలో తల్లితండ్రులు సైతం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ప్రధానార్చకులు పవనకుమార శర్మ, మురళీధర శర్మ బృందంల పర్యవేక్షణలో కొనాసాగిన ఈ ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యూవీ రమణమూర్తి, కమిటి సభ్యులు చంద్రశేఖర్, చెన్నారెడ్డి, కరుణాకర్ గౌడ్, చందానగర్ వెంకటేశ్వరాలయ ప్రధానార్చకులు, విశాఖ శ్రీ శారదా పీఠం తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులు, వాస్తు సిద్ధాంతి ప్రసాద శర్మ, బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శిల్పాఎన్‌క్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు, ఆలయ సేవాదళం సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పదివేల దీపాలు వెలిగించారు. ఆ దీపాకాంతులతో శ్రీ లక్ష్మీగణపతి దేవాలయ ప్రాంగణంలో ఆధ్యత్మిక శోభ వెళ్లివిరిసింది.