అభిషేకాలు, అర్చనలతో పూజలందుకున్న శ్రీ లలితాత్రిపుర సుందరి

నమస్తే శేరిలింగంపల్లి:శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ శ్రీ ధర్మపురి క్షేత్రం లో అమ్మవారు ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి గా దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అర్చనలతో విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజస్సుతో ఎరుపురంగు చీరను ధరించి నాలుగు భుజాలతో సింహవాహనిగా భక్తులకు దర్శనమిచ్చారు. పంచదశాక్షరీ మహామంత్రం అధిష్ఠాన దేవతగా లలితా త్రిపురసుందరిని ఆరాధించారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తిగా కొలుస్తున్నారు. చెరకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా శ్రీ మహారాజ్ఞి గా లలిత దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి, సకల ఐశ్వర్య అభీష్టాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపురసుందరీ దేవి విద్యా స్వరూపిణి. సృష్టి, స్థితి, సంహార రూపిణి. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు అమ్మ సకల సౌభాగ్యాలను అందిస్తుంది.

ధర్మపురి క్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవికి పూజలు నిర్వహిస్తున్న మహిళలు

హఫీజ్ పేట్ డివిజన్ పరిధి శాంతి నగర్ లో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం శాంతినగర్ కాలనీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, మల్లేష్, రాములు, హనీఫ్, రాము, శ్రీధర్ పాల్గొన్నారు.

శాంతి నగర్ లో అమ్మవారి మండపం‌ వద్ద అన్నదానంలో‌ పాల్గొన్న బాలింగ్ గౌతమ్ గౌడ్

గంగారం శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లలిత త్రిపుర సుందరి, మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో లక్ష కుంకుమార్చన చేసి అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు.

గంగారం లోని భక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో‌ కుంకుమార్చన చేస్తున్న మహిళలు

మాధవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లో శ్రీ దుర్గ దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఐదో రోజు‌ శ్రీ లలితాదేవిగా అలంకరించి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.

మాధవ్ బృందావన్ అపార్ట్ మెంట్ లో‌ పూజల్లో పాల్గొన్న మహిళలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here