చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారానికి గురై మృతి చెందిన మనీషా కేసులో నిందితులకు తెలంగాణ లో జరిగిన దిశ కేసు తరహాలో శిక్ష విధించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం శేరిలింగంపల్లి దలిత ఐక్య వేదిక కన్వీనర్ పివై రమేష్ ఆధ్వర్యంలో అత్యాచార ఘటనను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా చందనగర్ మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు మనీషా కేసులో న్యాయం జరగాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం గాంధీ విగ్రహం నుంచి బాబాసాహెబ్ డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి మనీషాకు జోహార్లు అర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ యూపీలో జరిగిన ఘటనను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో “దిశ” కేసులో ఏ విధంగా న్యాయం జరిగిందో అదే తరహాలో ఘటనకు పాల్పడిన వారిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, రంగారెడ్డి కమ్యూనిస్ట్ ఉపాధ్యక్షుడు శోభన్, కంది అశోక్, కంది రాఘవేందర్, ఆశీల శివ, గ్రేటర్ హైద్రాబాద్ దళిత అధ్యక్షుడు లాలయ్య, గ్రేటర్ హైద్రాబాద్ ప్రధాన కార్యదర్శి బొడికే శ్రీనివాస్, శేరిలింగంపల్లి మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షుడు జల్లే విజయ్, ఆనంద,రవిరాజా, మోహన్ నాయక్, కంది పెంటయ్య, నర్సింహ, డి.శ్యామ్, సోములు, ఎస్ రమేష్, అబ్రాహాము తదితరులు పాల్గొన్నారు.