- గచ్చిబౌలి టెలికం నగర్‌లో ఘటన
- ఇంట్లో పనిచేస్తున్న నేపాలి జంట జంప్
నమస్తే శేరిలింగంపల్లి: శ్రైశైల క్షేత్రానికి వెళ్లి వచ్చే లోపు ఇళ్లు గుల్లయిన సంఘటన రాయదుర్గం పోలిస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలి టెలికం నగర్‌లో రోడ్ నెంబర్ 9 లోని ప్లాట్ నెంబర్ 264లో నివాసం ఉండే బీరం గోవిందరావు కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఉదయం శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లాడు. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా కిటీకి గ్రిల్స్ తొలగించబడి, బెడ్ రూం తాళం పగుల గొట్టి ఉండటాన్ని గమనించాడు. ఐతే లాకర్ తాళం చెవులు సైతం బెడ్‌రూంలోనే అందుబాటులో ఉండటంతో లాకర్‌ను తెరిచిన దుండగులు 110 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.10 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ మేరకు బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గోవింద్ రావు ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యభర్తలు లక్ష్మన్(34), పవిత్ర(30)లు ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ నెపథ్యంలో వారే దోపిడికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలో లక్ష్మన్, పవిత్రల కదలికలను పోలీసులు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు మమ్మరం చేశారు.