లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: భవన నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మంత్రి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ డోర్ తెరచుకోకపోవడంతో దాదాపు ఐదు నిమిషాల పాటు మంత్రితో పాటు ప్ర‌భుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే అందులోనే ఉండిపోయారు. పోలీసులు, స్థానికులు శ్రమించి ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరచుకోవడంతో మంత్రి, ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆలోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గాంధీతో కలిసి హాజరయ్యారు. కార్యాలయ అంతస్తులోకి వెళ్లేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్టులోకి మంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు మరికొందరు నాయ‌కులు వెళ్లారు. గేటు వేసిన అనంతరం లిఫ్ట్ అధిక బరువు కారణంగా కదలక పోగా గేటు సైతం తెరచుకోలేదు. దాదాపు ఐదు నిమిషాల పాటు పోలీసులు, టిఆర్ఎస్ నాయకులు శ్రమించి గేటు తెరవడంతో మంత్రి, ప్రభుత్వ విప్ త‌దిత‌రులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం మెట్ల ద్వారా పైకి చేరుకున్న అతిథులు షెడ్యూల్ ప్ర‌కారం కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here