నమస్తే శేరిలింగంపల్లి: సినిమా చూసి ఇంటికి బైక్ పై వెళ్తున్న వ్యక్తి రోడ్డు మధ్యలో నిర్లక్ష్యంగా పార్కింగ్ చేసిన ట్రాలీ ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా ఎంఐజీహెచ్ హౌసింగ్ బోర్డు కు చెందిన మనోజ్ కుమార్ రెడ్డి సాప్ట్ వేర్ ఉద్యోగి. ఉద్యోగం రీత్యా హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ శుక్రవారం రాత్రి మాదాపూర్ లోని పీవీ ఆర్ ఐకాన్ లో సినిమా కోసమని మనోజ్ కుమార్ రెడ్డి బైక్ పై వెళ్లి తిరిగి ఇంటికి బయల్దేరాడు. ఏపీ 04 బిఎం 4467 బైక్ పై పంచవటి కాలనీలోని తన ఇంటికి వెళ్తుండగా మార్గమద్యలో మల్కం చెరువు పక్కన గల కొత్త రోడ్డులో గంగోత్రి స్కూల్ వద్ద డివైడర్ కు ఆనుకుని నిర్లక్యంగా పార్కింగ్ చేసిన టీఎస్ 30 యూసీ 3692 నంబరు గల బొలెరో ట్రాలీ ఆటోను మనోజ్ కుమార్ ఢీకొట్టడంతో చాతికి బలమైన గాయం కావడంతో వెంటనే సన్ షైన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోజ్ కుమార్ రెడ్డి మృతి చెందాడు. మృతుని భార్య కావ్య శ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.