పెళ్లి బ‌రాత్‌లో అప‌శృతి – బ్యాండ్ మేళం య‌జ‌మాని మృతి

  • పోలీసుల దాడివ‌ల్లే త‌మ బిడ్డ‌ చ‌నిపోయాడ‌ని బంధువుల ఆరోప‌ణ‌
  • కార్డియాక్ స్ట్రోక్‌తోనే న‌రేష్ మృతిచెందాడు: డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఉత్సాహంగా కొన‌సాగుతున్న ఓ పెళ్లి బ‌రాత్‌లో బ్యాండ్ మేళం య‌జ‌మాని అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన సంఘ‌ట‌న రాయ‌దుర్గం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… గ‌చ్చిబౌలి పీజేర్ నగర్‌లో నివసించే వడ్ల వీరేశ్ కుమార్ వివాహం నేప‌థ్యంలో శుక్ర‌వారం రాత్రి బ‌రాత్ తీశారు. కాగా సికింద్రాబాద్ ప్రాంతంకు చెందిన స‌ర‌స్వ‌తి బ్యాండ్ మేళం యాజమాని గ‌డిగె న‌రేష్ కుమార్‌ తన బృందంతో వ‌చ్చి బ్యాండ్‌ వాయించాడు. ఐతే గ‌చ్చిబౌలి మ‌హ‌రాజా కేఫ్ వ‌ద్ద‌కు బ‌రాత్ చేరుకోగానే స్థానికుల నుంచి రాత్రి 11.20 గంట‌ల ప్రాంత‌లో ఫిర్యాదు రావ‌డంతో రాయ‌దుర్గం పోలీసులు వచ్చి బ‌రాత్ ఆపేయాల‌ని సూచించి వెళ్లారు. ఐనా బ్యాండ్ మేళం కొన‌సాగించ‌డంతో 12 గంట‌ల‌ త‌ర్వాత మ‌రొక ఫిర్యాదు వ‌చ్చింది. దీంతో రెండో సారి పోలీసులు రావ‌డంతో బ్యాండ్ మేళాన్ని త‌ర‌ళించే టాటా ఏయిస్‌ వాహ‌నంను అక్క‌డి నుంచి హ‌డావిడిగా త‌ర‌ళిస్తున్న క్ర‌మంలో ఒక టిప్ప‌ర్‌ను ఢీకొట్టింది. ఈ క్ర‌మంలో న‌రేష్ కింద‌ ప‌డిపోగా మెడ భాగంలో గాయ‌మైంది. అత‌డు లేచి పోలీసు పాట్రోలింగ్‌ వాహ‌నం వ‌ద్ద‌కు రాగానే ఒక్క‌సారిగా కుప్ప‌కూలి పోయాడు. అత‌డిని స్థానిక హిమ‌గిరి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించగా అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు వైద్యులు దృవీక‌రించారు. దీంతో వాహ‌నం న‌డుపుతున్న‌ బ్యాండ్ మేళం స‌భ్యుడుపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఉస్మానియా ద‌వ‌ఖానాకు త‌ర‌లించారు.

మృతుడు న‌రేష్(ఫైల్‌)

పోలీసులే కారణం: మృతుడి బంధువులు
పోలీసుల దాడి వ‌ల్లే న‌రేష్ మృతి చెందాడని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. భరాత్‌ను బ‌ల‌వంతంగా నిలుపుద‌ల చేయించే క్ర‌మంలో బ్యాండ్ మేళం స‌భ్యుల‌ను పోలీసులు లాఠీల‌తో చిత‌క‌బాదార‌ని ఆరోపించారు. ఈక్ర‌మంలోనే న‌రేష్ త‌ల‌కు గాయ‌మై మృతిచెందాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ బిడ్డ మృతిపై పోలీసులు భాద్య‌త వ‌హించాల‌ని అన్నారు. కేసు విష‌యంలో నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు.

ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన ఘ‌ట‌న‌: పోలీసులు
న‌రేష్ బంధువుల ఆరోప‌ణ‌ల‌ను మాదాపూర్ డీసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ఖండించారు. వారి సొంత వాహ‌నం ఢీ కొట్ట‌డం వ‌ల్లే గాయ‌మైంద‌ని, ఈ క్ర‌మంలో కింద‌ప‌డిన న‌రేష్ స్ట్రోక్‌కు గుర‌య్యాడ‌ని అన్నారు. ఆ విషయాన్ని వైద్యులు దృవీక‌రించార‌ని, బ్యాండ్ మేళం స‌భ్యులు సైతం త‌మ స్టేట్‌మెంట్‌లో స్ప‌ష్టంగా జ‌రిగిన విష‌యాన్ని తెలిపార‌ని, అందుకు సంబంధించిన వీడీయోలు విడుద‌ల చేశామ‌ని తెలిపారు. పోలీసుల కార‌ణంగానే న‌రేష్‌ మృతి చెందాడ‌ని వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని అన్నారు. మరి కొన్ని సీసీ టీవీ ఫుటేజీల‌ ప‌రిశీలన కొన‌సాగుతుంద‌ని, అదేవిధంగా పోస్టుమార్టం రిపోర్టు వ‌స్తే పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అన్నారు.

?పాట్రోల్ వాహ‌నం వ‌ద్ద‌కు న‌డుచుకుంటు వ‌చ్చి కొద్ది క్ష‌ణాల్లోనే ఒక్క‌సారిగా కుప్ప‌కూలుతున్న న‌రేష్‌(వీడియో)

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here