శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని రఫా అనే డ్రగ్స్ పునరావాస కేంద్రంలో సందీప్ (39) అనే రోగి బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ డ్రగ్స్‌కు అలవాటు పడి గత 8 నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. అదే సెంటర్‌లోనే నెల రోజులు గా చికిత్స పొందుతున్న నల్గొండకు చెందిన ఆదిల్, బారకాస్‌కు చెందిన సులేమాన్ కలిసి సందీప్ పై దాడి చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావడంతో సందీప్, ఆదిల్, సులేమాన్ రఫా పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురి మధ్య గొడవ జరగడంతో సందీప్‌పై ఆదిల్, సులేమాన్ దాడిచేసి హత్య చేశారు. ఈ నేపథ్యంలో నిందితులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






