గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): హైడ్రే క్రేన్‌ను నిర్లక్ష్యంగా నడిపించడంతో అది అదుపు తప్పి ముందు వెళ్తున్న మరో క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో క్రేన్ బోల్తా పడగా దాన్ని నడిపిస్తున్న డ్రైవర్ తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ అలియాస్ అనిల్ యాదవ్ (26) నగరంలోని బాలానగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతను, షఫీ అనే మరో వ్యక్తి ఇద్దరూ కలిసి సోమవారం బాలానగర్ నుంచి రెండు హైడ్రా క్రేన్‌లను గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అమెజాన్ కంపెనీకి తీసుకువస్తున్నారు. ఇద్దరూ చెరొక క్రేన్‌ను నడపసాగారు. షఫీ ముందు క్రేన్‌ను నడిపిస్తుండగా.. అతన్ని పవన్ ఫాలో అవుతూ ఇంకో క్రేన్‌ను నడిపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 1 గంటకు విప్రో చౌరస్తా వద్ద పవన్ తాను నడిపిస్తున్న క్రేన్‌ను వేగంగా, నిర్లక్ష్యంగా నడిపించాడు. దీంతో ఆ క్రేన్ ముందు వెళ్తున్న ఇంకో క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో పవన్ నడిపిస్తున్న క్రేన్ బోల్తా పడింది. ఈ సంఘటనలో పవన్‌కు తీవ్రగాయాలై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.