శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నం.600 వద్ద ఉన్న యూ టర్న్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్స్ రాజవర్దన్, వికేందర్, సింహాచలం ఈ నెల 7వ తేదీన రాత్రి 10.25 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో భరత నగర్ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ కె.శ్రీనివాస్ లారీ(AP15Y4069)ని వేగంగా నిర్లక్ష్యంగా నడిపాడు. దీంతో యూటర్న్ సమీపంలో విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్‌ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో సింహాచలం తలకు తీవ్ర గాయం కాగా, వికేందర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. మరో కానిస్టేబుల్ రాజవర్దన్‌కు కుడిభుజం విరిగింది. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం మదీనాగూడలో ఉన్న శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు ఆంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. అయితే తలకు తీవ్ర గాయం కావడంతో సింహాచలం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు కానిస్టేబుల్స్‌కు చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి వ్యక్తి మృతికి కారణం అయిన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.