శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యుత్ సామగ్రిని చోరీ చేస్తున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.50 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కూకట్‌పల్లి జోన్‌కు చెందిన ఏసీపీ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నగరంలోని ఐడీఏ జీడిమెట్ల రామ్ రెడ్డి నగర్‌కు చెందిన కల్లూరి లక్ష్మణ్ (39) స్థానికంగా ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను మియాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సామగ్రిని చోరీ చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు గురువారం అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 6 ఎంసీసీబీలు, 8 కెపాసిటర్ బ్యాంకులు, ఒక ద్విచక్ర వాహనం (టీజీ08ఎల్2217) మొత్తం కలిపి రూ.1.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అతను తాను చేసిన నేరాలను అంగీకరించడంతో పోలీసులు ఈ మేరకు అతన్ని రిమాండ్‌కు తరలించారు. నిందితున్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నందుకు మియాపూర్ పోలీసులను ఏసీపీ అభినందించారు.






