శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ఇళ్ల ముందు, రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశాల్లో పార్క్ చేసి ఉండే ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.3.50 లక్షల విలువైన 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు పోలీసులు వివరాలను వెల్లడించారు. సరూర్ నగర్ బృందావన కాలనీతోపాటు కూకట్పల్లి బాలాజీనగర్‌లలో ఉన్న నివాసాల్లో ఉంటున్న వరాల మురళీధర్ రావు (44) కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతను ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేయడం ప్రారంభించాడు. ఇళ్ల ఎదుట, రైల్వే స్టేషన్ల పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను డూప్లికేట్ తాళం చెవులతో లాక్ తీసి అనంతరం వాహనాలను చోరీ చేస్తాడు. తరువాత వాటిని విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతను మాదాపూర్ చంద్రనాయక్ తండా రోడ్డులో చోరీ చేసిన ఓ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా పోలీసులు ఆపి పత్రాలను చూపించమని అడిగారు. కానీ అతను వాటిని చూపించకపోగా అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తాను ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్నట్లు అంగీకరించాడు.

అతను దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలు హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాయని తెలుసుకుని అక్కడి నుంచి 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విలువ రూ.3.50 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా మురళీధర్‌రావు ఇటీవలి కాలంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధుల్లో అనేక ద్విచక్ర వాహనాలను చోరీ చేశాడని పోలీసులు తెలిపారు. అతనిపై మాదాపూర్‌తోపాటు సరూర్ నగర్, కేపీహెచ్‌బీ, మధురానగర్, భువనగిరి రూరల్, చర్లపల్లి, సనత్ నగర్, బేగంపేట, ఆబిడ్స్, మార్కెట్, నిజామాబాద్ ఫోర్త్ టౌన్, కామారెడ్డి, సైఫాబాద్, గాంధీ నగర్, భువనగిరి టౌన్, మియాపూర్, కూకట్పల్లి, పటాన్ చెరు పోలీస్ స్టేషన్లలో వాహనాల చోరీల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ మేరకు నిందితున్ని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. కాగా నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న మాదాపూర్ పోలీస్ క్రైమ్ సిబ్బందిని మాదాపూర్ ఏసీపీ అభినందించారు.





